|
|
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం నెల్లూరు, మార్చి 9 (ఎపిఇఎంఎస్): జిల్లాల్లో బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నెల్లూరు జిల్లా మొత్తం మీద 85 కేంద్రాల్లో 58,726 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇందుకోసం నెల్లూరు డివిజన్‌లో 43, గూడూరు డివిజన్‌లో 22, కావలి డివిజన్‌లో 20 కేంద్రాలు మొత్తం 85 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక పర్యావేక్షకున్ని నియమించినట్లు డిఆర్‌ఓ జయరామయ్య తెలిపారు. అలాగే, పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జీరాక్స్ మిషన్‌లు లేకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రత్యేకించి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ప్రభుత్వం బసు సదుపాయం కూడా కల్పించింది. ఇప్పటికే డిఆర్‌ఓ జయరామయ్య ఆర్టీసీ, పోలీస్, ఇతర అధికారులతో పలు దఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించి పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షలు ఎండాకాలంలో జరుగుతున్నందువల్ల విద్యార్థులు వడదెబ్బకి గురికాకుండా వైద్య శిబిరాలను కూడా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోని మంచినీటి సౌకర్యం తదితరాలను కల్పించాయి. |
|